![]() |
| పెళ్లి తర్వాత మార్పు అవసరమా ? |
పెళ్లి…
మన సంస్కృతిలో అది కేవలం ఇద్దరు వ్యక్తులు ఇచ్చుకునే మాట కాదు.
అది రెండు కుటుంబాల మధ్య కట్టే ఒక వంతెన.
రెండు జీవితాలు కొత్త దిశలో నడిచే మలుపు.
రెండు వ్యక్తిత్వాలు ఒకే ప్రయాణం మొదలుపెట్టే క్షణం.
అందరూ శుభాకాంక్షలు చెబుతారు.
ఆ శుభాకాంక్షల మధ్యలో,
ఒక ప్రశ్న మాత్రం నిశ్శబ్దంగా నిలబడుతుంది ,
అది ఎవరూ పెద్దగా అడగని ప్రశ్న
ఎవ్వరూ బయటకు చెప్పని ప్రశ్న.
చాలా మనసుల్లో లోపలే ముళ్ళు లా గుచ్చుకుంటూ మిగిలిపోయే ప్రశ్న ఒకటి ఉంటుంది.
“ఎవరి కోసం మారాలి?”
“మారకపోతే తప్పేనా?”
కానీ చాలా మనసుల్లో ఇవే నిశ్శబ్దంగా గుచ్చుకుంటూ ఉంటాయి.
అందరూ సంబరంగా చూస్తారు.
కానీ ఆ సంబరాల వెనుక,
ఈ ప్రశ్న కు జవాబులు ఉండవు.
“పెళ్లి తర్వాత ఎందుకు మారిపోవాలి?
పెళ్లికి ముందు ఉన్న మనం… పెళ్లి తర్వాత ఉన్న మనం
పెళ్లికి ముందు ఒక అమ్మాయి…
తన అభిరుచులతో జీవిస్తుంది.
తన ఇష్టాలను తనతోనే మోసుకుంటూ ముందుకు సాగుతుంది.
తన స్వభావాన్ని ఎవరికి భయపడకుండా చూపిస్తుంది.
తన కలలను తనవిగా గట్టిగా పట్టుకుంటుంది.
ఆమె నవ్వు ఆమెదే.
ఆమె మాటలు ఆమెదే.
ఆమె నిర్ణయాలు కూడా ఆమెవే.
కానీ పెళ్లి అయిన తర్వాత
ఒక్కసారిగా జీవితం ప్రశ్నలతో నిండిపోతుంది.
“ఇప్పుడు ఇలా ఉండకూడదు…”
“ఇప్పుడు ఇలా చేయాలి…”
“ఇప్పుడు ఇలా మాట్లాడటం సరైంది కాదు…
ఈ మాటలు ఆజ్ఞలుగా అనిపించవు.
కానీ నెమ్మదిగా
ఆమెని మార్చే సూచనలుగా మారుతాయి.
అక్కడే పెళ్లి,
ఒక బంధంగా కాకుండా,
ఒక మార్పు కు ఆదేశంలా అనిపించడం మొదలవుతుంది.
అక్కడే వ్యక్తిత్వం మెల్లగా తగ్గిపోతుంది.
అక్కడే ఒక మనిషి
తనను తాను సర్దుకోవడం నేర్చుకుంటుంది.
మార్పు అనేది సహజమా? లేక బలవంతమా?
మార్పు తప్పు కాదు.
జీవితంలో ప్రతి దశలో మార్పు సహజమే.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే —
మార్పు మనలోంచి వస్తుందా? లేక మనపై పెట్టబడుతుందా?
ఇక్కడే పెళ్లి తర్వాతి జీవితంలో గందరగోళం మొదలవుతుంది.
ప్రేమ వల్ల వచ్చే మార్పు ఒకటి.
అంచనాల వల్ల వచ్చే మార్పు మరొకటి.
పెళ్లి తర్వాత ఎక్కువగా ఎవరు “మారాల్సి వస్తున్నారు”?
నిజం చెప్పాలంటే,
మన సమాజంలో పెళ్లి తర్వాత ఎక్కువగా మారాల్సి వస్తున్నది మహిళ.
ఆమె పేరు మారుతుంది.
ఆమె ఇల్లు మారుతుంది.
ఆమె పాత్ర మారుతుంది.
ఆమె బాధ్యతలు మారుతాయి.
కానీ…
ఆమె వ్యక్తిత్వం కూడా మారాలని అంచనా వేస్తాం.
అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది.
“ఇది కొత్త ఇల్లు కదా… కొంచెం మారాలి” అనే మాట
ఈ మాట వినడానికి మృదువుగా ఉంటుంది.
కానీ దీని లోపల ఉన్న భావం చాలా భారంగా ఉంటుంది.
“కొంచెం మారాలి” అంటే ఏమిటి?
నీ మాటలు తగ్గించాలి
నీ నవ్వు తగ్గించాలి
నీ ఇష్టాలు వెనక్కి పెట్టాలి
నీ అభిప్రాయాలు లోపలే ఉంచాలి
ఇవి చిన్న మార్పుల్లా కనిపించినా,
నెమ్మదిగా ఒక వ్యక్తిని లోపల నుంచే కుదించే ప్రయత్నాలు.
ఉదాహరణ కు రాధిక కధ నే తీసుకుంటే
రాధిక పెళ్లికి ముందు చాలా చురుకైన అమ్మాయి.
తన అభిప్రాయం చెప్పేది.
నవ్వేది.
తన ఫ్రెండ్స్‌తో మాట్లాడేది.
పెళ్లి తర్వాత మొదట్లో ఎవరు ఏమీ అనలేదు.
కానీ రోజులు గడిచే కొద్దీ…
“అత్తయ్య ముందే అలా మాట్లాడకూడదు”
“ఇంటి విషయాల్లో ఎక్కువగా మాట్లాడొద్దు”
“ఇప్పుడు నువ్వు ఇలా ఉండటం బాగోదు”
అని మెల్లగా మెల్లగా చెప్పడం మొదలైంది.
రాధిక మారింది.
కానీ ఆమె మారింది ఆనందంతో కాదు.
ఆమె మారింది అంగీకారంతో.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె నవ్వు తగ్గిపోయింది.
ఆమె మాటలు తగ్గిపోయాయి.
తనకు తానే కోల్పోయింది .
మారడం అంటే మనసు చంపుకోవడమా?
పెళ్లి తర్వాత మారడం అంటే
మన స్వభావాన్ని పూర్తిగా త్యాగం చేయడం కాదు.
కానీ చాలా సందర్భాల్లో
మారడం అంటే మనల్ని మనమే వెనక్కి నెట్టుకోవడంగా మారుతుంది.
ఇష్టాలను అణచుకోవడం.
భావాలను దాచుకోవడం.
నొప్పిని మౌనంగా భరించడం.
ఇది మార్పు కాదు.
ఇది మానసికం గా జరిగే యుద్ధం.
“అడ్జస్ట్ అవ్వాలి” అనే అత్యంత ప్రమాదకరమైన పదం
మన సమాజంలో ఎక్కువగా వినిపించే మాట —
“అడ్జస్ట్ అవ్వాలి”
ఈ మాట వినడానికి సాధారణంగా ఉంటుంది.
కానీ దీని వెనుక దాగి ఉన్న అర్థం చాలా ప్రమాదకరం.
అడ్జస్ట్ అవ్వాలి అంటే:
నీ అసౌకర్యాన్ని పట్టించుకోకూడదు
నీ నొప్పిని చిన్నదిగా భావించాలి
ఎదుటివాళ్ల సౌకర్యమే ముఖ్యమని నమ్మాలి
ఇలా పదే పదే చేస్తే
ఒక రోజు వ్యక్తి తనకే అర్థం కాని స్థితిలో నిలబడతాడు.
పెళ్లి అంటే వ్యక్తిత్వాన్ని కలపడం… తుడిచేయడం కాదు
పెళ్లి అంటే వ్యక్తిత్వాన్ని కలపడం… తుడిచేయడం కాదు
పెళ్లి అనేది
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం.
రెండు జీవితాలు ఒకే దారిలో నడవడం.
రెండు వ్యక్తిత్వాలు ఒకదానికొకటి చోటివ్వడం.
కానీ చాలా చోట్ల
ఈ అర్థం మెల్లగా మారిపోతుంది.
పెళ్లి అంటే
ఒక వ్యక్తి జీవితం లోకి ఇంకొకరు పూర్తిగా కలిసిపోవాలి,
తన ఇష్టాలను వెనక్కి పెట్టాలి,
తన స్వభావాన్ని తగ్గించుకోవాలి
అని భావిస్తారు.
ఇక్కడే సమస్య మొదలవుతుంది.
ఇక్కడే బంధంలో అసమతుల్యత జన్మిస్తుంది.
ఒకరు మారాలి.
తన అలవాట్లు, తన మాటలు, తన కలలు… అన్నింటినీ సర్దుకోవాలి.
ఇంకొకరు మాత్రం
ఏ మార్పు లేకుండా అలాగే ఉండాలి.
ఈ పరిస్థితిలో ప్రేమ ఉండదు.
అర్థం ఉండదు.
సమానత్వం ఉండదు.
ఇది కలిసి జీవించడం కాదు.
ఇది ఒకరు కుదించబడటం,
మరొకరు విస్తరించబడటం.
ఇది త్యాగం కాదు.
ఇది సహజమైన మార్పు కాదు.
ఇది అధికార సమీకరణ.
అక్కడ ఒకరు మౌనంగా మారుతారు.
మరొకరు మాట చెప్పే స్థితిలో ఉంటారు.
అక్కడ బంధం కనిపిస్తుంది గానీ,
సమానమైన భాగస్వామ్యం కనిపించదు.
పెళ్లి అంటే
ఇద్దరూ కొంచెం మారడం.
ఇద్దరూ కొంచెం నేర్చుకోవడం.
ఇద్దరూ కొంచెం వదిలేయడం.
కానీ ఎప్పుడూ
ఒక్కరే మారాలి,
ఒక్కరే వదిలేయాలి అంటే
అది ప్రేమ కాదు.
అది
మాటలతో కప్పిపుచ్చే
ఒక నిశ్శబ్దమైన అధికార వ్యవస్థ.
ఎందుకు మారాలని అనుకుంటాం?
సమాజం కోసం.
కుటుంబం కోసం.
“వాళ్లు ఏమనుకుంటారో” అనే భయం కోసం.
ఈ మార్పు
చాలా జీవితాల్లో మౌనమైన త్యాగాలకు కారణం.
ఈ మార్పు అవసరమైన చోట… అవసరం లేని చోట నడిపిస్తుంది....
ఈ మార్పు అవసరం ఉండే చోట...
ఒకరినొకరు గౌరవించడానికి
కొత్త బాధ్యతలను పంచుకోవడానికి
ఒకరికి ఒకరు చోటివ్వడానికి. సహాయపడుతుంది.
కానీ కొన్ని చోట్ల ఈ మార్పు
వ్యక్తిత్వాన్ని చంపడానికి,
స్వప్నాలను త్యాగం చేయడానికి,
భావాలను మౌనం చేయడానికి కూడా అడుగులు వేస్తూ ఉంది.
పెళ్లి తర్వాత మారకపోతే సమస్యేనా?
మారకపోవడం సమస్య కాదు.
కానీ మారకపోవడాన్ని తప్పుగా చూపించడం సమస్య.
“నీలా ఉండటం వల్ల ఇబ్బంది”
అని చెప్పడం కంటే
“మన ఇద్దరం ఎలా సర్దుకుందాం?”
అని అడగడం ప్రేమ.
నిజమైన మార్పు ఎలా ఉండాలి?
నిజమైన మార్పు అంటే....
మాట్లాడి వచ్చే నిర్ణయం
ఒత్తిడి లేని అంగీకారం
ప్రేమతో వచ్చే సర్దుబాటు
ఇది ఇద్దరి మీదా సమానంగా పడాలి.
చివరి మాట
పెళ్లి తర్వాత మారిపోవాల్సిన అవసరం
అందరికీ ఒకేలా ఉండదు.
మారాలి అంటే
మనల్ని మనమే కోల్పోవడం కాదు.
పెళ్లి ఒక బంధం.
అది వ్యక్తిత్వాన్ని గౌరవించాలి.
కుదించకూడదు.
ఎవరైనా మారాలంటే
ఆ మార్పు ప్రేమ వల్ల రావాలి.
భయంతో కాదు.
ఒత్తిడితో కాదు.
ఎందుకంటే
మారిపోయిన వ్యక్తి కన్నా
గౌరవించబడిన వ్యక్తే
బంధాన్ని బలపరుస్తారు .
ఈ ఆర్టికల్ కానీ మీకు నచ్చితే మీ మనసుకు నచ్చిన వారికి షేర్ చేయండి .
ఇవి కూడా చదవండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి